ఇవాళ మా దేశానికి బ్లాక్ డే. ఇవాల్టినుండి వారం రోజులు ఇక్కడ సంతాపదినాలు. ఎటువంటి శుభకార్యాలు జరగవు, హోటల్స్, పబ్బులు లాంటివి నడవవు. ఒకవేళ నడిచినా ఎలాంటి సంగీతం వినపడకూడదు. ఎట్లాంటి హడావిడి చేయకూడదు. అసలు ఎందుకిలా అంటే "ప్రపంచ చరిత్రలో మా దేశానికి ఒక రుధిరాధ్యాయం ఉంది".
ఈ దేశం పేరు రువాండా. కాంగో, ఉగాండా, బురుండి దేశాలు సరిహద్దులుగా ఉన్న తూర్పు / మధ్య ఆఫ్రికా దేశం ఇది. ఇక్కడ రెండు జనాభా మొత్తం రెండు జాతులుగా వర్గీకరించబడినది. పొట్టి వారు మరియు పొడుగు వారు. ఈ ఒక్క జాతి బేధం తప్ప ఎలాంటి అసమానతలు, కొట్లాటలు వీరి మధ్య లేవు. కుల మతాలకి అతీతంగా ఉంటారు. ఆకలి బాధ తప్ప వీరి చేత వేరే ఏ శక్తి తప్పు చేయించలేదు. ఈ రెండు జాతుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగానే ఉండేవి. వారిలో వారికి వివాహ బంధాలు కూడా నడిచేవి. ఒక కుటుంబంలో సమాన సంఖ్యలో రెండు జాతుల వారూ ఉండేవారు. కానీ అధికారం మాత్రం ఎక్కువగా పొడుగువారి అధీనంలో ఉండేది. దేశం లోని ముఖ్యమైన పదవుల్లో పొడుగు జాతి వారే ఉండేవారు. అలాంటి సమయంలో...... ఒక రోజు......
అది 1994 వ సంవత్సరం, ఏప్రిల్ 6 వ తేది, సాయంత్రం సుమారు ఆరుగంటల సమయంలో ఈ దేశ రాష్ట్రపతి జువేనేల్ హబ్యారిమాన (సరి అయిన ప్రినంసేషన్ నాకు తెలియదు) ఎక్కిన విమానం పేల్చివేయబడినది. అది మొదలుకొని వంద రోజుల పాటు అంటే జూలై నెల మూడోవారం దాకా ఇక్కడ జరిగిన దారుణ మారణ హోమం ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ రెండు జాతులు నడిరోడ్డు మీద ఒకరినొకరు నరుక్కోడం మొదలెట్టారు. ఇది ఏ రాజకీయాలకో పరిమితం అనుకునేరు.. కానే కాదు సామాన్య ప్రజల మధ్య జరిగింది. ప్రతీ వాడు ఒక కత్తి పట్టుకుని రోడ్డు మీదికి రావడం ఆ రెండవ జాతి మనిషి ఎవడు కంటబడితే వాడిని నరికి చంపడం. ఇలా వంద రోజుల పాటు జరిగిన నరమేధంలో సుమారు పది లక్షల మంది అసువులు బాసారని ఒక అంచనా.
కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఈ హత్యాకాండ జరిగింది. ఒక భర్త తను పొట్టి వాడు అయి ఉంటే తన కుటుంబంలోని పొడుగువారిని నరికి చంపేవాడు (బంధాలకి అతీతంగా). ఇది స్త్రీలు వృద్ధులు పసి పిల్లలు అని ఎలాంటి తారతమ్యం లేకుండా జరిగిన దారుణం. గర్భిణి స్త్రీలను కూడా నరికి చంపారని ఒక సమాచారం. ఐ.రా.స బలాలు కూడా ఇక్కడ పని చేయలేకపోయాయి. స్వచ్చంద సంస్థలు సైతం గాయపడిన వారికి వైద్యం రహస్యంగా అందిచాల్సిన పరిస్తితి.
ఒక వంక ప్రపంచం అంతా శాంతి మంత్రం జపిస్తూ, వసుధైక కుటుంబ భావనకోసం పాటు పడుతుంటే, ఇక్కడ మాత్రం రోడ్లు, కాలవలు, చెరువులు అన్ని రక్తమయం. ఎక్కడికక్కడ శవాల గుట్టలు, నరికివేయబడ్డ తలలు, కాళ్ళు, చేతులతో భయానకమైన దృశ్యాలు. ప్రపంచలోని ఏ శక్తి ఆ రోజున ఇక్కడ ఈ మారణ హోమాన్ని ఆపలేకపోయింది. ఇందులో ఒకే ఒక మినహాయింపు విదేశీయులు. ఆ సమయంలో ఇక్కడ వివిధ వృత్తుల్లో ఉన్న విదేశీయులని మాత్రం దోపిడీకి పరిమితం చేసి ప్రాణాలతో వదిలేసారు. ఇప్పటికీ ఇక్కడ చిన్నారులకి చరిత్ర పాఠాలు చెపుతుంటే, ఈ దారుణాన్ని విని తట్టుకోలేక స్పృహ తప్పిన ఆ పిల్లలని వైద్యశాల కి తరలించడం నా కళ్ళతో నేను చూసాను. అయితే ఇంతటి నరమేధానికి గల కారణం కేవలం అధికార కాంక్ష అని ఒక అంచనా.
"ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం......
............ నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం"
అయితే వంద రోజులు పూర్తి అయిన తరువాత ప్రస్తుత రాష్ట్రపతి, అప్పటి సైన్యాధికారి అయిన గౌరవనీయులు శ్రీ పాల్ కగామే గారు మొత్తం పరిస్థితిని అధీనంలోకి తెచ్చి శాంతి స్థాపన చేసారు. ఈ జేనోసైద్ తరువాత రువాండా మొత్తం ఆఫ్రికన్ దేశాల్లోనే సురక్షితమైన, శాంతి వంతమైన దేశంగా స్థిరపడింది. ఈ రోజు ఇక్కడ మేము అర్ధ రాత్రి దాటాక కూడా రోడ్ల మీద తిరగచ్చు నిస్సందేహంగా. బహుశా యుద్ధం ముగిసిన తరువాత ప్రశాంతత కావచ్చు.
ఘటనకు సంబంధించిన ఫోటోలు చూడాలనుకుంటే గూగుల్ సెర్చ్ లో రువాండన్ జేనోసైడ్ అని చూడొచ్చు. అంతటి భయంకరమైన దృశ్యాలు బ్లాగులో ఉంచడం మనస్కరించలేదు, అందుకే నేను పెట్టలేదు.
7, ఏప్రిల్ 2010, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)