6, మార్చి 2014, గురువారం

తరాలు-అంతరాలు 2

ఈ టపాలకి తరాలు అంతరాలు అనే శీర్షిక పెట్టడానికి ఒక కారణం ఉంది. పైన చెప్పిన వీరందరూ కూడా మారుతున్న సామాజిక పరిస్తితులకి అనుగుణంగా తమని తాము మార్చుకుని ఉన్నంతలో తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు.  స్త్రీని వంటింటికి పరిమితం చేసిన పాతతరం నుంచి,  అన్ని రంగాల్లో రాణించి మగవారికి ఏ మాత్రం తీసిపోమని నిరూపించిన నేటి తరం వరకు ఉన్న విభిన్న మజిలీలకి చెందిన వారు ఉన్నారు. నిన్న అమ్మమ్మ, పెద్దమ్మక్కయ్య, అమ్మ ల గురించి వివరించాను. ఇవాళ  మిగిలిన వారి గురించి ముచ్చటిస్తాను. 

విజయ భారతి (బన్ని పిన్ని)  

మేమందరం బన్ని పిన్నీ అని ప్రేమగా పిలుచుకునే మా పిన్నిగురించి చెప్పాలంటే ఎన్ని పేజీలయినా చాలదు. ఇలాంటి అమ్మ ఉంటే బిడ్డలు సాధించని విజయం ఉండదు. పిల్లల ఉన్నతి కోసం, వారి చదువుల కోసం, కోరికల కోసం ఈమె చేసిన త్యాగాలు అసామాన్యమ్. తాము ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కుడా అవేవీ కనీసం పిల్లల మనసుల దరిదాపులకి కూడా రానీయకుండా జాగ్రత్తపడింది మా పిన్ని. కష్టాలన్నీ తమవి, సుఖాలు మాత్రం బిడ్డలవి అనే భావనతో సాకింది ఆ మహాతల్లి.  అంకితభావంతో అత్తింటి వారికి సేవ చేస్తూనే, ఒక తల్లిగా తన బిడ్డలని తీర్చిదిద్దడంలో, వారి అవసరాలు ఆకాంక్షలు నెరవేర్చడంలో ఎటువంటి లోటూ రానివ్వలెదు. ఒకానొక సమయంలో అందని ఎత్తులకి ఆశ పడుతున్నావని బంధువర్గం అందరి నుంచి విమర్శలు ఎదుర్కుని కూడా, ధైర్యంగా నిలబడి ఒంటరి పోరాటం చేసి తనని తాను నిరూపించుకుంది.  అటువంటి అమ్మ దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలం.  తన పిల్లలని ఎవరూ పల్లెత్తు మాట అనకుండా చూసుకునే పిన్ని, తప్పు చేసిన పిల్లలకి బుద్ది చెప్పే పధ్ధతి కూడా ఎంతో విలక్షణంగా ఉండేది.  నేనయితే నా బిడ్డని ఈమెలా పెంచగలిగితే చాలు అనుకుంటాను.    

అనూరాధ, విజయ శారద (రాధ పిన్ని- శారు పిన్ని)   

మాతృదేవోభవ అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనం మా పిన్నులు.  వారు తమ జీవితంలో తల్లికి ఇచ్చిన ప్రాధాన్యత వేరెవరికీ ఇవ్వలెదు.  చిట్టచివరి సంతానంగా అందరికన్నా ఎక్కువ సమయం పుట్టినింట్లో గడిపి, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుని, ఏ మగపిల్లలకి తీసిపోమని తల్లితండ్రుల బాధ్యత, నడవలేని అక్కయ్య బాధ్యత కూడా స్వీకరించిన స్త్రీముర్తులు. అమ్మని ఎలా ప్రేమించాలి అనేది వీరి నుంచే నేర్చుకోవాలి ఎవరైనా.  బాల్యమంతా దుర్భరమైన ఆర్ధిక ఇబ్బందులలో గడిచినా, చదువులో, ఆట-పాటలలో అన్నింట్లో మేటిగా గుర్తింపు పొంది తల్లితండ్రులకి గర్వకారణం అయ్యారు.  కన్నతల్లి కంట కన్నీరు వీరు చూడలేరు.  తల్లితండ్రుల కోసం, కుటుంబ బాధ్యత కోసం వీరు తమని తాము త్యాగం చెసారు. తమ సరదాలు సంతోషాలు మాని తల్లితండ్రుల సంతోషమే తమ ధ్యేయంగా జీవితం సాగించారు.  ఆత్మాభిమానానికి మారుపేరుగా అత్తింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుని నలుగురికీ ఆదర్శం అయ్యారు.          

ఇంకో రెండు రోజుల్లో రాబోతున్న మహిళా దినోత్సవం సందర్భంగా నా జీవితంలో ఆదర్శప్రాయులైన స్త్రీ మూర్తులకి నా హృదయపూర్వక పాదాభివందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి