5, మార్చి 2014, బుధవారం

తరాలు-అంతరాలు 

ఇప్పుడు నేను ఈ టపా రాయడానికి ఒక ముఖ్య కారణం ఉంది.  నా జీవితంలో ఆదర్శప్రాయులై నిలిచిన స్త్రీ మూర్తులు వారి వారి ఔన్నత్యం, వారు నాకు ఏ విధంగా ఆదర్శం అని చెప్పడానికి ఈ చిన్న ప్రయత్నమ్. ముందుగా మా అమ్మమ్మ గారి కుటుంబం గురించే ప్రస్తావించాలి. ఆరుగురు ఆడపిల్లల అమ్మగా, ఎనమండుగురు సంతానాన్ని కన్న తల్లిగా ఆమె తన బాధ్యత నిర్వర్తించిన తీరు అమోఘం.  

సీతా మహా లక్ష్మి (అమ్మమ్మ) 

మా అమ్మమ్మగారు పన్నెండేళ్ళ వయసులో అత్తింట అడుగుపెట్టిన తల్లి లేని బిడ్డ.  అత్త చాటు కోడలుగా మసులుకుంటూ ఇంటెడు బండెడు చాకిరీ చేస్తూ, అత్తా ఆడపడచుల ఆరళ్ళకి నలిగిపోతూ, భర్త దాష్టీకానికి లొంగిపోయి జీవితం సాగించింది. అత్తా మామల ఆస్తి నిస్వార్ధంగా ఆడపడచుకి ధారపోసి, నిరాడంబరమైన జీవితం గడిపింది.  తను కన్నఎనమండుగురు సంతానమే  తనకి ఆస్తి.  గుమాస్తాగిరి చేసే భర్తకి అనుగుణంగా నడుచుకుంటూ, కుటుంబమే తానుగా, తానే కుటుంబంగా బాధ్యతలను నెరవేరుస్తూ తన ఉనికిని మరిచింది. ఎన్ని కష్ట నష్టాల్లోను బిడ్డలని కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటూ ప్రేమతో పెంచింది.  జరిగేది, జరగబోయేది అంతా మంచికే అని, అంతా  కర్మ ఫలితమని నమ్మి, కష్టాల్లో కుంగిపోక, సుఖాల్లో పొంగిపోక, తన దుఃఖానికి వేరొకరిని బాధ్యులని చేసి నిందించక ప్రేమ మయమైన, నిష్కల్మషమైన సహనముర్తిగా జీవితాన్ని గడిపింది.  నేటికి ఈమె వయసు 86 సంవత్సరాలు. 

సరళా అన్నపూర్ణ (పెద్దమ్మక్కయ్య)        

పదహారో ఏట అత్తింట అడుగుపెట్టి అనేక ఆరళ్ళు ఓర్చుకుని, ఆరుగురు సంతానానికి తల్లి అయి, భర్తకి, అత్తకి అనుకూలవతిగా, ఉమ్మడికుటుంబ బాధ్యతలు నెరవేర్చి, కాదన్న వారితోనే ఔననిపించుకున్న ఆదర్శమూర్తి.  అనేక ఓడిడుడుకులకి ఓర్చి సంతానానికి చక్కటి బుద్ధులు నేర్పి తీర్చిదిద్దిన మాతృమూర్తి.  సహనానికి మారు పేరుగా, కోపమంటే తెలియని శాంతమూర్తిగా జీవితం గడుపుతున్న ఉత్తమ ఇల్లాలు.  ఒక మంచి కూతురుగా, మంచి కోడలిగా, మంచి ఇల్లాలిగా, మంచి తల్లిగా, మంచి సోదరిగా, ఇప్పుడు అమ్మమ్మా, నానమ్మగా తన బాధ్యతలని విజయవంతంగా నిర్వర్తించిన ఒక స్ఫూర్తి దాత. నిత్యం భగవన్నామ స్మరణతో, పది మంది మంచి కోరుకుంటూ, హితభాషణలు పలుకుతూ, ప్రేమించే కొడుకూ కోడళ్ళ చెంత ప్రశాంతమైన వృద్ధాప్యం గడుపుతూ పదిమందికీ   ఆదర్శప్రాయమైనది.  

పైన చెప్పిన మా అమ్మ అమ్మమ్మలు నిఖార్సయిన పాతతరానికి ప్రతినిధులు. 

విజయలక్ష్మి                     

పాత కొత్త తరాల సంధి కాలానికి ప్రతినిధి మా అమ్మ.  అత్తా కోడళ్ళు అంటేనే ఒకే చూరు కింద ఉండే శత్రువులు అనే అభిప్రాయాన్ని మా అమ్మ - బామ్మల ని చూసి ఎవరైనా మార్చుకొవలసిందే.  అనుభవజ్ఞురాలయిన అత్తగారి కింద తర్ఫీదు పొందిన సుసిక్షితుడైన సైనికునిగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య కుటుంబాన్ని సాఫీగా నడిపిన ధీశాలి మా అమ్మ.  ఉన్నదానిలో సంతృప్తి కరమైన జీవితం గడపడం మా అమ్మ ప్రత్యేకత.  ఈమెకి శత్రువులే లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈమె దృష్టిలో చెడ్డవారు లెరు, అనాకారులు లేరు.  ప్రపంచం అంతా అందంగా, మనుషులందరూ మంచి వారుగా అనిపిస్తారు మా అమ్మకి. ఈమె నోరు తెరిచి ఎవరినీ దూషించడం నేను వినలెదు. ఇది బాగోలేదు అని దేని గురించయినా చెప్పడం నేను చూడలేదు.  నాన్న కేవలం ఆర్ధిక బాధ్యతలు నిర్వర్తిస్తే, బిడ్డల సంరక్షణ, చదువు సంధ్యల బాధ్యత సమర్దవంతం గా నిర్వర్తించింది మా అమ్మ.  సహనానికి, శాంతానికి, మంచితనానికి, సేవాభావానికి మా అమ్మ ప్రతీక.     

ఇప్పటికి సెలవు. మిగిలిన వారి గురించి రేపు ప్రస్తావిస్తాను.  





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి